Tuesday, March 11, 2008

ఇందిరా క్రాంతి పధం స్త్రీలకు శిక్షణ:

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న (ప్రపంచబ్యాంకు ప్రాజెక్టు) ‘ఇందిరా క్రాంతి పధం’ పథకం కింద లక్షలాది మంది స్త్రీలు సమీకృతులై వున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోను, దశలవారీగా మండల కేంద్రాల్లోను హెల్ప్లైన్ ప్రారంభించాలన్నది వారి నిర్ణయం. ప్రపంచం బ్యాంకు ప్రతినిధి వరలక్ష్మి, జమున గార్లు హెల్ప్ లైన్‍కు వచ్చి చూసారు. చాలా ఇప్రెస్ అయ్యారు. వెలుగు గ్రూఫుల్లోని స్త్రీలకు హెల్ప్ లైన్ నిర్వహణలో శిక్షణ నివ్వాల్సిందిగా కోరడం, దానికి మేము అంగీకరించడం జరిగింది. మొదట కరీంనగర్ నుండి వచ్చిన నలుగురు స్త్రీలు వారం రోజుల పాటు మా వద్ద శిక్షణ పొంది వెళ్ళి, కరీంనగర్లో అశ్రిత హెల్ప్లైన్ ప్రారంభించారు. మెదక్ జిల్లా స్త్రీలు కూడా శిక్షణ పొంది వెళ్ళాక హెల్ప్ లైన్‍కు అఫ్లై చేసారు. కొద్ది రోజుల్లో అదీ మొదలవ్వ బోతోంది. ఇప్పటివరకు కరీంనగర్, పశ్చిమగోదావరి, కృప్ణా, మెదక్, చిత్తూరు, నల్గొండ, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన గ్రామీణ స్త్రీలు హెల్ప్ లైన్ ఎలా నిర్వహించాలో నేర్చు కున్నారు. మా దగ్గర నేర్చుకుంటూనే మహిళా కోర్టు, మహిళా పోలీస్ స్టేషన్, కుటుంబ సలహా కేంద్రాలను కూడా దర్శించి వాటి పనితీరును అవగాహన చేసుకున్నారు. ఇందిరా క్రాంతిపధం ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీలందరితో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలను కుంటున్నాము. ప్రతి జిల్లా కేంద్రంలోను, మండల కేంద్రాల్లోను హెల్ప్ లైన్‍లను విస్తరించి, సమస్యల్లో వున్న స్త్రీలకు బాసటగా నిలవాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రవనికి రూపకల్పన జరిగింది.హింసాయుతమైన రోజువారీ జీవితం ఈ రోజు స్త్రీల జీవితాలని అతలాకుతలం చేస్తోంది. కుటుంబ హింసకి చదువుకున్న, చదువురాని స్త్రీలు సమానంగానే గురవుతున్నారు. ఈనాటి వేగవంతమైన జీవిత విధానం పక్కవారి కేమి జరుగుతుందో పట్టించుకోనివ్వడం లేదు. మనిషి ‘’మేము'’ లోంచి అతివేగంగా ‘’నేను'’లోకి జారి పోతున్నాడు. ఈ ‘’నేను'’ లందరు ఒంటరి ద్వీపాలవుతున్నారు. ఎవరి గురించి ఎవ్వరు పట్టించుకోని ఈ పరిస్థితుల్లో బాధిత స్త్రీలకు అండగా వుండేది భూమిక హెల్ప్లైన్లాంటి చిరు సహాయలే. కరీంనగర్ నుంచి వచ్చిన ఓ గ్రామీణ మహిళ మాటల్లో చెప్పాలంటే ‘’భూమికలో మీరు ఒక చిరుదీపం వెల్గించారు. మేము ఈ దీపంను ముట్టించుకుని మా కరీంనగర్ తీసుకెళ్ళి జిల్లా అంతా వెలిగిస్తాం.'’అన్నట్టుగానే వారు తమ హెల్ప్ లైన్‍ను ప్రారంభించుకున్నారు.

హెల్ప్ లైన్ ప్రాసెస్

సి.హెచ్. నాగమణి, పి.కల్పన, కౌన్సిలర్స్

సమస్యల్లో వున్న స్త్రీల కోసం ప్రారంభించిన భూమిక హెల్ప్ లైన్‍కు మొదట ఫోన్ కాల్ రాగానే, కౌన్సిలర్ కాల్‍ను రిసీవ్ చేసుకుని హలో భూమిక హెల్ప్ లైన్ అని అంటారు ఆ మాట సేవార్థికి నమ్మకం కలిగించే విధంగా వుండాలి. సేవార్థితో సంబంధాన్ని ఏర్పరుచుకుని, సమస్య తీవ్రత, సందర్భాన్ని, సేవార్ధి భావాలను అంచనా వేసి సమస్యను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలను అందచేయలి. సేవార్ధి తన సమస్యపై తనకు అవగాహన కలిగేలా వివరించాలి. సమస్య తీవ్రతను బట్టి ఒక్కొక్క కాలర్కి 15 నిల నుండి 60 నిల వరకు సమయం తీసుకుంటాం. సేవార్ధికి తన సమస్యపై అవగాహన కలిగిన తరువాత వారికి తగిన విధమైన పరిష్కార మార్గాలు అందిస్తాం. సేవార్ధి స్వీకరించి ఆచరిస్తారు. ఉదా :- ఒక సేవార్ధి తన అత్తమామ, భర్తతో వరకట్న వేధింపులకు గురిఅవుతుందని హెల్ప్ లైన్‍కు కాల్ చేస్తే ఆ హింసకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే ఆమెకు పెళ్ళి అయిన దగ్గర నుండి పుట్టింటి వారు ఎంత కట్నం ఇచ్చారు, ఎందరు పిల్లలు, పెళ్ళయిన దగ్గరనుండి భరిస్తున్న యెడల అది మీ పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపుతుంది. పెళ్ళయిన దగ్గరనుండి కాకుండా పిల్లలు పుట్టిన దగ్గరనుండి అయితే ఆ సేవార్ధి జన్మించిన పిల్లల వివరాలు, అమ్మాయి పుట్టిన దగ్గరనుండి ఈ విధమైన హింసను ఎదుర్కొంటున్నారా? సేవార్ధి భర్త ఏమి చేస్తూ వుంటారు? ఆర్ధిక ఇబ్బందులు ఏమైనా వున్నాయ? లేదా భర్త అతని తల్లిదండ్రుల ప్రభావంలో వున్నాడా? లేక అత్తమామ బాగానే వుండి కేవలం భర్త ద్వారానే ఈ హింసకు గురి అవుతున్నారా? మొదలైన ప్రశ్నలు అడిగి తెలుసుకున్న తరువాత, ప్రస్తుత సమస్యకు సేవార్ధి అభిప్రాయన్ని తెలుసుకుంటాం.

ఒకవేళ సేవార్ధి భర్తనుండి విడిపోవాలని గాని, లేదా అతనిని వర్చుకునే అవకాశం వుందా అనిగాని, లేదా తాత్కాలికంగా విడిపోయి అతని దగ్గరనుండి మనోవర్తి పొందాలని గాని, లేదా భర్తపై కేసు పెట్టాలని గాని లేదా కేసు పెట్టిన తరువాత ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఎదురై కోర్టు ఫీజులు చెల్లించలేనని గాని లేదా అత్తమామల నుండి విడిపోయి జీవిస్తే ఆమె భర్తలోమార్పు వస్తుందని గాని ఇలా ఏవిధంగానైనా సేవార్ధి తన అభిప్రాయన్ని వ్యక్తం చేసినట్లయితే దానికి తగిన విధంగా భూమిక హెల్ప్ లైన్ ఫోన్ ద్వారా సేవార్ధికి సలహా మరియు సమాచారాన్ని అందచేస్తుంది. అంటే సేవార్ధి భర్త నుండి విడిపోవాలని అనుకుంటే ఒక్కసారి కుటుంబ సలహా కేంద్రంలో కౌన్సిలింగునకు వెళ్ళి సలహాను తీసుకున్న తరువాత విడాకులకు వెళ్ళమని సలహా యిస్తుంది. ఎందుకంటే ఆమె తీసుకున్న నిర్ణయంవలన ఆమె పిల్లలు బాధ పడకూడదు, మరియు వారి భవిష్యత్తులో ఎటువంటి ఒత్తిడికి లోనుకాకూడదనే ఉద్దేశ్యంతో, మరియు ఆమె నిర్ణయానికి గౌరవం యిచ్చి అడ్వకేటు సలహా ద్వారా ముందుకు వెళ్ళమని చెప్తాం. అంతేకాకుండా అడ్వకేటు అవసరం లేదు అని అనుకుంటే స్వయంగా సేవార్ధి, కుటుంబ న్యాయస్థానానికి వెళ్ళవచ్చునని, స్వయంగా తన సమస్యను తానే జడ్జి గారి ఎదుట వ్యక్తం చేయవచ్చుననే సమా చారం యిస్తూ యిక మీదట అంటే కుటుంబ న్యాయస్థానంకు వెళ్ళిన తరువాత ఏదైనా అవసరం ఉన్నట్లయితే మరలా కాల్ చేయమని చెప్తూనే భార్యాభర్తలు ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నందుకు సిద్ధంగా వుంటేగనక లోక్అదాలత్ ద్వారా కూడా విడాకులు తీసుకునే సౌకర్యం వుందనే సలహా కూడా యివ్వడం జరుగుతుంది.

అలాకాకుండా తాత్కాలికంగా విడిపోయి, మనోవర్తి పొందాలని అనుకున్నా లేదా కేసు పెట్టాలని అనుకున్నా వారికి గృహహింసచట్టం గురించిన సమాచారాన్ని అందచేసి దాని ద్వారా కేసు ఫైల్ చేసుకోవచ్చని, ఈ చట్టంలో అన్ని వెసులుబాటులు కల్పించారనే సమాచారం అందిస్తూ ఆయ జిల్లాలకు సంబంధించిన రక్షణ అధికారి ఫోన్ నంబర్లు యిస్తూ సలహాను అందిస్తాం. ఒకవేళ కేసు పెట్టినప్పటికి సేవార్ధి ఆర్థిక సమస్యల కారణంగా కేసు ముందుకు నడవలేకపోతే ఫ్రీలీగల్ ఎయిడ్ కు వెళ్ళి ఒక దరఖాస్తు పెట్టుకుంటే లీగల్ ఎయిడ్ వాళ్ళు ఒక అడ్వకేటును ఏర్పాటు చేసి కేసును ముందుకు నడిపిస్తారు. ఈ లీగల్ ఎయిడ్ హైకోర్టులోను జిల్లా కేంద్రాల్లోను వుందనే సమాచారం యిస్తాం.

అంతేకాకుండా అత్తమామల నుండి విడిపోయి భర్తతో కలసి విడిగా వుండాలని, అతనిలో మార్పు వస్తుంది అనే నమ్మకం సేవార్ధికి ఉన్నట్లయితే వారికి దగ్గరలో వున్న కుటుంబ సలహా కేంద్రాల అడ్రసు లేదా ఫోన్ నెంబర్లు ఇస్తాం. లేదా తను ఇంట్లో వుండి స్వయం ఉపాధి కోసం ప్రయత్నం చేయలని అనుకుంటే వారి జిల్లాలోవున్న మహిళా ప్రాంగాణాల అడ్రసు, ఫోన్ నెంబరు ఇస్తాం.ఇలా సేవార్ధి అభిప్రాయన్ని బట్టి వారికి తగిన విధమైన సలహా, సమాచారాన్ని, సమస్యను బట్టి సాధ్యమయినంతగా ఫోన్లోనే కౌన్సిలింగ్ చేసి వారికి పరిష్కారవర్గాలను చూపిస్తాం.

ఈ పరిష్కార మార్గాలు పూర్తిగా సేవార్ధి అభిప్రాయం మీదనే ఆధారపడతాయి. అంతేకాని సేవార్ధి సమస్యకు కౌన్సిలర్ తన అభిప్రాయన్ని రుద్దటం జరగదు. కౌన్సిలింగ్ సూత్రాలలో నాన్-జడ్జిమెంటల్ అటిట్యూడ్( తీర్పరితనంతో మెలగక పోవడం) చాలా ముఖ్యమైనది. ఈ సూత్రం ఆధారంగానే సేవార్ధి అభిప్రాయన్ని దృష్టిలో ఉంచుకుని కౌన్సిలర్ తన సలహాలను ఇవ్వాలి. యిచ్చిన సలహాను ఏవిధంగా అమలు చేసుకున్నారో మరలా ఆ సమస్య ఫలితం కోసం హెల్ప్లైన్ ఫోన్ చేసి ప్రతిస్పందన యివ్వమని చెప్తాం, దానినే ఫాలో-అప్ కేసెస్ గా చెప్తాం. ఈ ఫాలో-కేసెస్లో చాలా వరకు పరిష్కారం జరిగిన కేసులు వుంటాయి.

1 comment:

జాహ్నవి said...

మంచి information అందించారు madam. ఈ విధంగా మేము కూడా ఏమైనా సేవ అందించాలంతే ఎలాగో కూడా దయచేసి bloglO పెట్టగలరు .ధన్యవాదములు