Tuesday, March 11, 2008

పెనుచీకటిలో చిరుదీపం

2006 మార్చి 16న భూమిక హెల్ప్ లైన్ ప్రారంభమైంది.

ఈ పదిహేను నెలల కాలంలో దాదాపు రెండు వేలకు పైచిలుకు స్త్రీలు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకోవడం, వారికి కావలసిన సమాచారం, సలహాలను అందించడం జరిగింది. ఎన్నో సీరియస్ కేసులను పరిష్కరించుకునేలా దిశా నిర్దేశం యివ్వడం జరిగింది.

అసలు ఈ హెల్ప్ లైన్ ప్రారంభించాలన్న ఆలోచన ఎలా కలిగిందని చాలామంది అడుగుతుంటారు. మీకందరికి తెలుసు 1993 నుండి భూమిక పత్రిక విజయ వంతంగా నడుస్తోంది. పత్రికలో వుంటనే మేము ఇంతకు ముందు ఎన్నో కేసులు చేసిన అనుభవాలున్నాయి. మంజులా చౌదరి కేసు, హైకోర్టు అడ్వకేట్ సంగీతా శర్మ కేసు లాంటి ఎన్నో కేసులకు సంబంధించిన ఉద్యమాల్లో మేము పాల్గొన్నాము. పత్రిక ఫోన్ నెంబర్‍కు ఎంతోమంది స్త్రీలు ఫోన్ చేసి తమ సమస్యల పరిష్కారం కోసం సలహాలడిగేవారు. సమాచారం అడిగేవారు. అప్పటికి నా వద్ద అలాంటి ఏర్పాటు లేకపోవడంవల్ల ఎవరైనా మాకు ఫోన్ చేస్తే, ఆయ సమస్యల మీద పని చేసే సంస్థలకు, వ్యక్తులకు ఆ కేసుల్ని అప్పగించేవాళ్ళం.

క్రమంగా ఇంత మంది స్త్రీలకి హెల్ప్ అవసరం వుందన్న విషయం అర్ధమై మనమే ఎందుకు ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చెయ్యకూడదు అన్పించింది. భూమిక లాంటి చిన్న సంస్థకు సాధ్యమయ్యే పని కాదు. వెంటనే ఆక్స్ఫామ్ గిరిజతో ఈ విషయమై చర్చించాను. తను చాలా పాజిటివ్‍గా స్పందించింది. ప్రపోజల్ పంపించమని కోరింది. ఆ తర్వాత వెంట వెంటనే పనులు జరిగిపోయయి. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినం రోజున ప్రారంభోత్సవం జరపాలనుకున్నాను. అయితే అప్పటికి ఫోన్ కనెక్షన్ రానందున మార్చి 16న ప్రారంభించాం. చాలా మంది మిత్రులు ఈ సమావేశానికి హాజరయ్యరు.

అదే రోజున ఆంధ్రజ్యోతి ‘’నవ్య'’ పేజీలో హెల్ప్ లైన్ ఆవిర్భావం గురించి అర్ధపేజీ కథనాన్ని ప్రచురించడంతో ఫోన్స్ వరదలా వచ్చాయి. మొదటి రోజున 145 కాల్స్ వచ్చాయి. ఈ స్పందన మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇక వెనుతిరిగి చూసింది లేదు. ప్రతి రోజూ భిన్నమైన కాల్స్. విభిన్నమైన సమస్యలు. ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు హెల్ప్లైన్ పని చేస్తుంది. హెల్ప్లైన్ వచ్చే కాల్స్ రక రకాలుగా వుంటాయి. గృహహింసకు సంబంధించిన కేసులే 80 శాతం వుంటాయి. వరకట్న వేధింపులు, కుటుంబ తగాదాలు, వివాహేతర సంబంధాలు, రెండో పెళ్ళిళ్ళులు, ఎన్ఆర్ఐ వివాహ సమస్యలు. ఇంకా అనేక రకాలైన సమస్యలు చెబుతుంటారు. పరిష్కారాలవెదుకులాటలో భూమిక హెల్ప్లైన్ తోడ్పాటు అడుగుతుంటారు.

మేము హైదరాబాద్లో హెల్ప్లైన్ పెట్టుకుని సమస్యల్ని ఎలా పరిష్కరిస్తామనే ఆలోచన మీకు రావడం సహజం. మా కొచ్చే కాల్స్ ఎక్కువ శాతం కేవలం ‘’వినడం'’తోనే ముగుస్తాయి. తమ గుండెల్లో సుడులు తిరుగుతున్న దు:ఖాన్ని విప్పి చెప్పుకునే ఔట్లెట్గా కొంతమంది ఉపయెగించుకుంటారు. తన్నుకొచ్చే బాధని పెదవి అంచుమీదే బిగించి తమ దు:ఖాన్ని పంచుకుంటారు. కాల్ మొదలై నప్పటి ఉద్వేగం, ఉద్రేకం కాల్ ముగిసేటప్పటికి సర్దు కుంటాయి. మాట్లాడే పద్ధతిలో, గొంతులో ఎంతో మార్పు కనబడుతుంది. తీర్పరితనంతో, తప్పులు ఎంచే పద్ధతిలో హెల్ప్ లైన్ మెలగదు కాబట్టి కాలర్ ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరగడం గమనిస్తాము. అప్పటి వరకు ‘’తప్పునీదే. నీ వల్లనే ఇదంతా జరిగింది'’ అనే మాటలను విని విని విసిగి హెల్ప్ లైన్‍కి కాల్ చేసినపుడు మనం ఆమె దు:ఖ తీవ్రతని అర్థం చేసుకుని ఆమెకి మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం వల్ల తన మీద తనకి నమ్మకం, గౌరవం పెరుగుతాయి.

అంటే ‘’వినడం'’ అనేది హెల్ప్లైన్ ప్రధానలక్షణంగా చెప్పొచ్చు. ఇంక సలహా, సమాచారం ఇవ్వడం గురించి- మేము హెల్ప్లైన్ నిర్వహణకు కావలసిన సమాచారం మొత్తం సేకరించి పెట్టుకున్నాం. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్లు, న్యాయధికారుల ఫోన్ నెంబర్లు, ప్రొటెక్షన్ ఆఫీసర్ల ఫోన్ నెంబర్లు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపర్నెంట్లు, ఎమ్.ఆర్వోలు, ఎమ్డివోలు ఇలా ప్రతి జిల్లాకి సంబంధించిన సమాచారం సేకరించుకుని హెల్ప్లైన్ డెస్క్ మీద సిద్ధంగా పెట్టుకున్నాం. ఏ మారుమూల పోలీస్స్టేషన్ కైనా ఫోన్ చేసి మాట్లాడే వెసులుబాటు కల్పించుకున్నాం.
హెల్ప్ లైన్‍లో స్వచ్ఛందంగా పనిచేయడానికి ఎందరో ముందుకు వచ్చారు. అడ్వకేట్లు, సైక్రియాట్రిస్ట్లు మాతో కలిసి పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాకు అడ్వకేట్స్ నెట్‍వర్క్ వుంది. ఆయ ప్రాంతాల స్త్రీలకు అవసరమైతే వారి ఫోన్ నెంబర్లు , అడ్రస్లు ఇస్తాం. లీగల్ సర్వీసెస్ ఆథారిటీ ద్వారా ఉచిత న్యాయం అందే వీలు కల్పిస్తాం. లోక్ అదాలత్ సమాచారం అవసరమైన వారికి అందచేస్తాం.

హెల్ప్ లైన్ నెంబరు ప్రాచుర్యం

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియ ద్వారా హెల్ప్ లైన్ నంబరు చాలా ప్రాచుర్యం పొందింది. ఆంధ్రజ్యోతి, ఈనాడుతో సహ అనేక దినపత్రికలు, మ్యాగజైన్లు హెల్ప్ లైన్ నంబర్ రాష్ట్రమంతా తెలిసేలా కథనాలు ప్రచురించాయి. నవ్య, వసుంధరలు చాలా పాప్యులర్ స్త్రీల పేజీలు. ఈ పేజీలలో హెల్ప్ లైన్‍కు స్థానం దొరకడంతో చాలా మంది స్త్రీలకు దీని గురించి తెలిసింది. అలాగే టీ.వి.9, ఈటీవి 2ల స్త్రీల కార్యక్రమం నవీన, సఖిల ద్వారా నంబరు ప్రతి ఇంటికి చేరింది. హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్గా నేనిచ్చిన టీవి షోల ద్వారా కూడా నంబర్ బాగా పాప్యులర్ అయ్యింది. భూమికకి ఎక్సేంజీ కాపీలుగా అందే మ్యాగజైన్లన్నీ తమ వంతు సహాకారాన్ని అందిస్తున్నాయి. స్టిక్కర్లను అతికించడం ద్వారా, కార్డులను పంచడం ద్వారా కూడా నెంబర్‍ని ప్రాచుర్యంలోకి తేగలిగాము.

హెల్ప్ లైన్ ప్రభావం:

భూమిక హెల్ప్ లైన్ విజయవంతంగా నడుస్తూ ఎంతోమంది బాధిత స్త్రీలకు బాసటగా నిలవడంతో చాలామంది తాము కూడా హెల్ప్ లైన్ నడపదలిచామని, మా పనిలో భాగస్వాములు కాదలిచామని ముందు కొచ్చారు. ఇంకా వస్తున్నారు. తెనాలిలో ప్రియబాంధవి అనే ఆవిడ హైదరాబాద్ వచ్చి భూమిక హెల్ప్ లైన్ చూసి ఉత్తేజితురాలై తాను కూడా ఒక హెల్ప్ లైన్ ప్రారంభించారు. అనురాధ, రేవతిలు కుటుంబ సలహా కేంద్రాన్ని ప్రారంభించారు. ముఖాముఖి కౌన్సిలింగ్ కావలసిన వారికి ‘హర్షిణి’ పేరుతో నడుస్తున్న ఈ కుటుంబ సలహా కేంద్రానికి రిఫర్ చేయడం జరుగుతోంది. కాంతి గారు న్యాయవాది వృత్తిలో వుంటూ, ప్రతి శనివారం హెల్ప్ లైన్‍లో కూర్చుని న్యాయసహాయం కావలసిన స్త్రీలకు సలహాలనిస్తున్నారు. చాలామంది వివిధ జిల్లాల నుండి స్వచ్ఛంధంగా పనిచేయడానికి ముందుకొచ్చారు. వారందరిని హైదరాబాద్ పిలిచి ఒక వర్కుషాప్ నిర్వహించడం కూడా జరిగింది. ఈ వర్కుషాప్ కు హాజరైన అబ్బూరి ఛాయదేవిగారు ‘’దీనినొక ఉద్యమంలాగా తీర్చిదిద్దారే'’ అన్నారు.

No comments: